మార్కెట్లో గ్రీన్ ద్రాక్ష, నల్ల ద్రాక్ష అనే రెండు రకాలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి సందేహం ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి కాలంలో పుచ్చకాయ, మామిడి పండ్లతో పాటు ద్రాక్ష పండ్లను చాలా మంది ఇష్టపడతారు. ఇవి తీయ్యగా, రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి తగినంత నీటిని అందించడంలో కూడా సహాయపడతాయి. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలు తగ్గించడానికి ద్రాక్ష మంచి ఎంపికగా పరిగణించబడుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో ముఖ్యంగా గ్రీన్ ద్రాక్ష, నల్ల ద్రాక్ష అనే రెండు రకాలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి సందేహం ఉంటుంది. కొంత మంది నల్ల ద్రాక్ష మంచిదంటే మరికొందంటే గ్రీన్ ద్రాక్ష మంచిదని చెబుతుంటారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ ద్రాక్ష సాధారణంగా ఎక్కువగా అందరికీ అందుబాటులో ఉండే రకం. వీటిలో విటమిన్ C, విటమిన్ K, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణకు కూడా గ్రీన్ ద్రాక్ష ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక, ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

ఇక నల్ల ద్రాక్ష విషయానికి వస్తే, ఇవి మరింత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే రెస్వెరాట్రాల్ అనే పోషకం శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది వృద్ధాప్య లక్షణాలను ఆలస్యంగా రావడానికి సహాయపడుతుంది, అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. నల్ల ద్రాక్షలో ల్యూటిన్, జీక్సాంథిన్ వంటి పదార్థాలు కూడా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి ఇవి మంచివి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారు పరిమితంగా తీసుకుంటే కొంత ఉపయోగం ఉంటుంది
శాస్త్రీయంగా చూస్తే, నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కొంచెం ఎక్కువ ప్రయోజనం ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవిలో శరీరానికి తేమ అందించడంలో గ్రీన్, నల్ల రెండు రకాల ద్రాక్షలు కూడా ఉపయోగకరమే. మీ రుచి, అవసరాన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు

అయితే ద్రాక్ష తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి సమయంలో ద్రాక్ష తినడం మానుకోవాలి, ఎందుకంటే ఇవి తీపి, పులుపు కలగలసినవి కావడం వల్ల గుండెల్లో మంట, దగ్గు వంటి సమస్యలు రావచ్చు. అలాగే నిద్రకు ముందు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో కూడా ఎక్కువగా పుల్లగా ఉన్న ద్రాక్ష తినకూడదు, ఇది గ్యాస్ లేదా యాసిడిటీకి కారణం కావచ్చు.
