Spread the love

తమిళనాడు రాజకీయాల్లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఎప్పుడూ ఇద్దరి మధ్యే సాగే పోరును కాదని.. మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన నటుడు, టీవీకే అధినేత విజయ్ చరిత్రను తిరగరాశారు. దశాబ్దాలుగా ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు దీటుగా నిలబడి, ఏకంగా 108 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సినిమాల్లో రికార్డులను తిరగరాయడం విజయ్‌కు కొత్తేమీ కాదు. కానీ రాజకీయాల్లో తొలి ఎన్నికల్లోనే 108 సీట్లు సాధించడం మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టినట్లే.. ఈవీఎం రికార్డులను కూడా బ్రేక్ చేశాడు.

పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందిన విజయ్.. కింగ్ మేకర్‌గా కాకుండా ఏకంగా కింగ్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు మరో పది సీట్ల దూరంలో ఉన్న టీవీకే, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో కోలీవుడ్ నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల సరసన విజయ్ చేరబోతున్నారు.

విజయ్ విజయం ఒకెత్తు అయితే, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో హల్చల్ చేస్తోంది. విజయ్‌తో కలిసి బీస్ట్ సినిమాలో ఆడిపాడిన బుట్టబొమ్మ పూజా హెగ్డే, ఆయన గెలుపును ముందుగానే పసిగట్టడం విశేషం. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘జననాయగన్’ షూటింగ్ సమయంలో చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు పూజా హెగ్డే సైగలతో విజయ్‌ను చూపించడం, దానికి విజయ్ సిగ్గుపడుతూ నవ్వడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పూజా హెగ్డే గెస్సింగ్ మామూలుగా లేదుగా.. దళపతి పవర్‌ను ముందే కనిపెట్టింది అంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు

హీరోయిన్ త్రిష కూడా విజయ్ విజయాన్ని ముందుగానే గుర్తించి ,తిరుమలకు వెళ్లి మరి స్వామి వారిని దర్శించుకుంది. ఇక సినిమా గ్లామర్‌ను కేవలం క్రేజ్‌గా మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఓట్లుగా మార్చుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. తమిళనాడు యువత దళపతికి బ్రహ్మరథం పట్టడంతో పాత పార్టీల కోటలు బీటలు వారాయి. ‘జననాయగన్’ సినిమా టైటిల్‌కు తగ్గట్టే విజయ్ నిజమైన జననాయకుడిగా అవతరించారు. దశాబ్దాల రాజకీయాన్ని మార్చేసిన ఈ దళపతి గెలుపుపై సినీ సెలబ్రెటీల నుంచి రాజకీయ నాయకుల వరకు అభినందనల వర్షం కురుస్తోంది. అతి త్వరలోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది.