ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో సామాన్యుల నుంచి స్టార్ల వరకు అందరూ రకరకాల హెర్బల్ డ్రింక్స్‌పై మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికో, జీర్ణక్రియ మెరుగుపడటానికో చాలామంది రోజూ జీలకర్ర నీరు తాగుతుంటారు. అయితే ఈ నీటిని ఎప్పుడు తాగాలి? ఎలా తయారు చేయాలి? అనే విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. అతిగా తాగడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరు ఫోకస్ పెడుతున్నారు. సామాన్యుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు అందరూ తమ ఫిట్‌నెస్ మంత్రంగా వివిధ రకాల ఔషధ జలాలను ఆశ్రయిస్తున్నారు. సోంపు నీరు, మెంతుల నీరు, సెలెరీ వాటర్ వంటివి జాబితాలో ఉన్నప్పటికీ.. అందరూ ఎక్కువగా ఇష్టపడేది మాత్రం జీలకర్ర నీరు. అయితే ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.

జీర్ణక్రియకు అమృతం: ఆయుర్వేదం ప్రకారం జీలకర్ర ఒక గొప్ప వంటింటి ఔషధం. ఇది మందకొడిగా ఉన్న జీర్ణశక్తిని ఉత్తేజపరుస్తుంది. మన శరీరంలోని విషపూరిత పదార్థాలను బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆకలి లేమితో బాధపడేవారికి ఇది గొప్ప ఉపశమనం. అయితే చాలామంది త్వరగా ఫలితం రావాలని రోజంతా ఈ నీటిని సిప్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల ఆశించిన ప్రయోజనం అందకపోవచ్చు.

తయారు చేసే సరైన పద్ధతి: జీలకర్ర నీటిని ఎలా తయారు చేస్తున్నారనే దానిపైనే దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒక స్పూన్ జీలకర్రను రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు రంగు మారే వరకు మరిగించడం వల్ల జీలకర్రలోని పోషకాలు నీటిలోకి చేరుతాయి. మరిగించిన నీటిని వడకట్టి, అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి. మరీ వేడి నీటిని తాగడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఎప్పుడు తాగితే ఫలితం..?: జీలకర్ర నీటిని తాగడానికి ఉత్తమ సమయం ఉదయం ఖాళీ కడుపుతో తాగడం. ఒకవేళ ఉదయం వీలు పడకపోతే, భోజనం చేసిన తర్వాత చిన్న చిన్న సిప్స్ తీసుకుంటూ తాగవచ్చు. ఇలా చేయడం వల్ల భోజనం తర్వాత కలిగే కడుపు ఉబ్బరం లేదా భారంగా ఉండే సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరంలో కలిగే మంటను తగ్గించి, చల్లదనాన్ని ఇవ్వడానికి ఇది బాగా పనిచేస్తుంది.
జాగ్రత్తలు తప్పనిసరి: ఏదైనా సరే మితంగా తీసుకున్నప్పుడే అది ఔషధంగా పనిచేస్తుంది. మోతాదుకు మించి తీసుకోవడం లేదా సరైన పద్ధతి పాటించకపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి పైన పేర్కొన్న విధంగా సరైన పద్ధతిలో జీలకర్ర నీటిని మీ దినచర్యలో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.
