Spread the love

కుప్పం… ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం! ఆయన సొంత ఊరు నారావారిపల్లె ఉన్నది చంద్రగిరి నియోజకవర్గంలో! ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యింది చంద్రగిరి నుంచే! కానీ… పలు కారణాలతో చంద్రబాబు ‘కుప్పం’ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.

కుప్పం… ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం! ఆయన సొంత ఊరు నారావారిపల్లె ఉన్నది చంద్రగిరి నియోజకవర్గంలో! ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యింది చంద్రగిరి నుంచే! కానీ… పలు కారణాలతో చంద్రబాబు ‘కుప్పం’ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 1989 నుంచి సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ‘కుప్పం’ రూపు రేఖలను మార్చివేశారు. అభివృద్ధికి చిరునామాగా మార్చారు.

1989లో ఇప్పటిదాకా కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా గెలుస్తున్నారు. వెనుకబడిన ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 1995లో ముఖ్యమంత్రి కావడంతో అప్పటి నుంచి కుప్పం దశ మారుతూ వచ్చింది. వినూత్న కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు కుప్పాన్నే ఎంచుకుంటారు. ఇజ్రాయెల్‌ టెక్నాలజీ (డ్రిప్‌ ఇరిగేషన్‌)ని తొలుత ఇక్కడికే తీసుకొచ్చారు. హంద్రీనీవా కుప్పం ఉపకాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను నియోజకవర్గానికి తీసుకొచ్చి 110 చెరువుల్ని నింపారు. భూగర్భ జలాలు పెంచి ఇక్కడి కరువుకు శాశ్వత పరిష్కారం చూపించారు. పెద్దఎత్తున సబ్సిడీలు ఇచ్చి మల్బరీని ప్రోత్సహించారు. అటు చిత్తూరుకు, ఇటు తమిళనాడులోని కృష్ణగిరికి అనుసంధానిస్తూ డబుల్‌ రోడ్లు వేయించారు. ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు స్థానికంగా ఇల్లు నిర్మించుకున్నారు. ప్రతి మూడు నెలలకోసారి మూడు రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇలా కుప్పం నియోజకవర్గం కోసం చంద్రబాబు నిత్యం తపిస్తున్నారు. రాష్ట్ర మ్యాప్‌లో చిట్ట చివర ఉన్న కుప్పాన్ని.. ఇప్పుడు దేశంలోనే టాప్‌ నియోజకవర్గంగా మారుస్తున్నారు.

రూ.9322 కోట్ల పెట్టుబడులతో దాదాపు 1000 ఎకరాల్లో 30 భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వాటిలో కొన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. మరికొన్ని పరిశ్రమల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 30.75 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఏర్పాటు చేసిన ఏబీఐఎస్‌ ప్రోటీన్స్‌ చికెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఇప్పటికే ప్రారంభమైంది. సుమారు 500 మందికి ఉపాధి లభించింది. ఆర్గాఫీడ్‌ కంపెనీ కూడా ఉత్పత్తి ప్రారంభించింది. రూ.2081 కోట్లతో అథా గ్రూప్‌ బ్యాటరీ మెటీరియల్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. దీనిద్వారా 2600 మందికి ఉపాధి లభించనుంది. పయనీర్‌ క్లీన్‌ యాంప్స్‌ విమాన తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. దీనిద్వారా 1400 మందికి ఉపాధి లభించనుంది. అలాగే 20 వేల మందికి ఉపాధి లక్ష్యంతో రూ.899 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న అడిడాస్‌ ఫుట్‌వేర్‌ సంస్థకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొత్తంగా రానున్న ఒకట్రెండు సంవత్సరాల్లో ఈ కంపెనీలన్నీ ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. 40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి ఇవ్వనున్నాయి.