Spread the love
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఉప‌రిత‌ల ఆవ‌ర్తనం వ‌ల్ల మొన్న‌టివ‌ర‌కు వ‌ర్షాలు ప‌డ్డాయి గానీ ఇప్పుడు ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి.

ఈ రెండు నెలల్లో ఎండ తీవ్రత 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అత్యధికం. కర్నూలు జిల్లా నగరడోనలో 43.7, నంద్యాల జిల్లా గోస్పాడులో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి ఈ నెల చివరివరకూ కొనసాగే అవకాశం లేకపోలేదు. నేడు.. రాష్ట్రంలో 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.