డిజిటల్ పేమెంట్లలో వేగంతో పాటు భద్రత కూడా ముఖ్యమని ఆర్బీఐ భావిస్తోంది. మన అజాగ్రత్త వల్లనో, లేక మోసగాళ్ల మాయమాటలు నమ్మో మనం పంపే డబ్బును మధ్యలోనే ఆపేందుకు వీలుగా ఒక గంట సమయాన్ని (Golden Hour) విండోగా మార్చాలని ఆర్బీఐ భావిస్తోంది. ఒక చర్చా పత్రం ద్వారా విడుదల చేసిన ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, డిజిటల్ చెల్లింపుల తీరు పూర్తిగా మారనుంది.

ఈ ప్రతిపాదన ప్రకారం.. మీరు ఎవరికైనా రూ. 10,000 కంటే ఎక్కువ నగదు పంపినప్పుడు, ఆ డబ్బు మీ అకౌంట్ నుంచి కట్ అయినప్పటికీ ఎదుటివారికి వెంటనే చేరదు. మధ్యలో ఒక గంట పాటు బ్యాంక్ వద్ద హోల్డ్‌లో ఉంటుంది. ఈ లోపు మీరు చేసిన చెల్లింపులో ఏదైనా పొరపాటు ఉందని గుర్తించినా, లేదా ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడని తెలిసినా.. వెంటనే ఆ లావాదేవీని రద్దు (Cancel) చేసే అవకాశం మీకు ఉంటుంది.

నేటి కాలంలో హ్యాకింగ్ కంటే ‘సోషల్ ఇంజనీరింగ్’ మోసాలే ఎక్కువ. అంటే.. బ్యాంక్ అధికారులమని ఫోన్ చేయడం లేదా అత్యవసరమని నమ్మించి మనతోనే డబ్బులు పంపించడం (Official Push Payment frauds). ఒక్కసారి మనం పిన్ ఎంటర్ చేసి డబ్బు పంపితే, అది క్షణాల్లో డెబిట్ అయిపోతుంది. తీరా మనం మోసపోయామని గ్రహించే లోపే ఆ డబ్బును నేరగాళ్లు డ్రా చేసుకుంటారు. ఈ “అత్యవసరాన్ని” దెబ్బకొట్టడమే ఆర్బీఐ వ్యూహం. ఆ ఒక్క గంట విరామం బాధితుడికి పునరాలోచించుకునే సమయాన్ని ఇస్తుంది.

అన్నింటికీ ఆలస్యం ఉండదా? లేదు! ఆర్బీఐ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. మీ రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకం కలగదు: వ్యాపారులకు చెల్లింపులు (P2M): మీరు దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇచ్చే డబ్బులు ఎప్పటిలాగే తక్షణమే అందుతాయి. చిన్న లావాదేవీలు: రూ. 10,000 లోపు పంపే నగదుపై ఈ ప్రభావం ఉండదు. పునరావృత చెల్లింపులు: మంత్లీ సబ్స్క్రిప్షన్లు, ముందే ఆమోదించిన పేమెంట్లు ఆగవు. లక్ష్యం ఎవరంటే: కేవలం వ్యక్తిగత బదిలీలు (P2P), అది కూడా పెద్ద మొత్తంలో కొత్త వ్యక్తులకు పంపేటప్పుడు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది.
ఒకవేళ ఈ నిబంధన అమల్లోకి వస్తే, అత్యవసర సమయాల్లో ఇబ్బంది కలగకుండా ఉండటానికి నిపుణులు ఒక ట్రిక్ చెప్తున్నారు. ఎవరికైనా పెద్ద మొత్తం పంపాల్సి వచ్చినప్పుడు.. ఉదయమే వారికి ఒక రూపాయి పంపి ‘వైట్‌లిస్ట్’ చేయండి. ఆ తర్వాత పెద్ద మొత్తం పంపితే జాప్యం లేకుండా వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. దీనిపై వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. వేగం కంటే భద్రతే మిన్న అనుకునే వారికి మాత్రం ఇది ఒక గొప్ప వరమే!
