అల్పాహారం లో ఈ మార్పులతో సులభంగా బరువు తగ్గవచ్చు
అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టమైన పని అన్న విషయం అందరికీ తెలిసిందే. బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడం, యోగా, జిమ్ చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చేస్తుంటారు.

అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టమైన పని అన్న విషయం అందరికీ తెలిసిందే. బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడం, యోగా, జిమ్ చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలని చెప్పి కొందరు బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. కానీ అలా చేయకూడదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బరువు తగ్గేందుకు గాను ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల రోజులో మిగిలిన సమయాల్లో ఉదయం కన్నా ఎక్కువ ఆహారం తింటారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. దీని వల్ల బరువు తగ్గకపోగా బరువు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఉదయం ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్ ఫాస్ట్‌ను మానేయకూడదని సూచిస్తున్నారు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకుంటే దాంతో బరువు చాలా తేలిగ్గా తగ్గవచ్చని చెబుతున్నారు.

ఉదయం మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు తక్కువగా, కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల శరీరానికి కావల్సిన శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి. బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్లు ఉండే ఆహారాలను అధిక మొత్తంలో తీసుకుంటే బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. కనుక బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్లు ఉండే ఆహారాలను అధికంగా తినాల్సి ఉంటుంది. ప్రోటీన్లు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పైగా ప్రోటీన్లను జీర్ణం చేసేందుకు శరీరం క్యాలరీలను ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని వల్ల కూడా బరువు తగ్గుతారు.

ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను ఉదయం తింటే ఎంతో మేలు జరుగుతుంది. చికెన్, మటన్, చేపలు, పప్పు దినుసులు వంటి ఆహారాలను తింటే ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. నల్ల శనగలు, బీన్స్, పచ్చి బఠానీలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వీటిల్లోనూ ప్రోటీన్లుస సమృద్ధిగా ఉంటాయి. అలాగే కోడిగుడ్లు, అవకాడో, పీనట్ బటర్, బాదంపప్పు, యాపిల్స్, అరటి పండ్లు, ద్రాక్ష, బెర్రీలు, చిలగడ దుంపలు, బ్రోకలీ, పాలకూర, మిరియాలు, వాల్ నట్స్, దాల్చిన చెక్క, అల్లం, అవిసె గింజలు, కొబ్బరినూనె వంటి ఆహారాలను ఉదయం తీసుకోవడం వల్ల ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇవన్నీ కడుపు నిండిన భావనను కలగజేస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు.
