ఆరోగ్యానికి ఏది మంచిది?
మాంసాహారం తినడంలో రకరకాల అనుమానాలు. ఒకళ్లు చికెన్ మంచిదంటే.. ఇంకొకళ్లు ‘కాదు మటన్ మంచిదం’టారు. చికెన్ బెస్ట్ ప్రొటీన్ ఫుడ్ అని కొందరంటే.. మటన్.. ప్రొటీన్, ఫ్యాట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అని మరికొందరంటారు. అసలు ఈ రెండిటి కంటే చేపలు, రొయ్యలు మేలంటారు ఇంకొందరు. మాంసాహారంపై ఇలా రకరకాల వాదనలు జరుగుతుంటే.. ఇప్పడు కొత్తగా ‘‘మాంసం ఏదైనా.. ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు సైంటిస్టులు. ఏ మాంసమైనా కొలెస్ట్రాల్‌ను పెంచేదే కాబట్టి దానివల్ల గుండె పోటు, గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు.

చికెన్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మటన్‌లో ప్రొటీన్‌తో పాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కొవ్వు తినకూడదు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకునే వాళ్లు మటన్‌కి బదులు చికెన్‌ను ఎంచుకుంటారు. అయితే కొలెస్ట్రాల్‌తో సంబంధం లేని వాళ్లు మాత్రం మటన్‌ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఈ రెండు ఆరోగ్యానికి అంత మంచివికావనుకునే వాళ్లు చేపలు, రొయ్యలు తింటుంటారు. అసలు ఈ మూడిట్లో ఏది మంచిది. ఏది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది అని తెలుసుకునేందుకు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ సంస్థ’ ఓ రీసెర్చ్ చేసింది. ఇప్పటి వరకు కొలెస్ట్రాల్‌ను పెంచే మాంసాహారం రెడ్ మీట్ ఒక్కటే అనుకునే వాళ్లు.. కానీ ఈ రీసెర్చ్ ఆ ఆలోచనని పూర్తిగా మార్చేసింది. రెడ్ మీట్, వైట్ మీట్ రెండూ కార్డియోవ్యాస్కులర్ డిసీజెస్‌కు కారణమవుతాయని తేల్చింది. మాంసం ఏదైనా కొలెస్ట్రాల్ మీద ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతుదట.

నిత్యం మనం తినే ఆహారాల వల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని అందరికీ తెలిసిందే. అందులో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్), మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) అని రెండు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి మేలు చేస్తే, చెడు కొలెస్ట్రాల్ మాత్రం మనకు చేటు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. బరువు కూడా పెరుగుతారు. అయితే ఈ రకమైన ‘లో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్’ రెడ్ మీట్, వైట్ మీట్ రెండింటిలో ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే రెడ్ మీట్ తో పోలిస్తే వైట్ మీట్ లో దీని శాతం కొంత తక్కువ. అంటే మటన్ కంటే చికెన్ కొంచెం ఎక్కువ హెల్దీ అని చెప్పుకోవచ్చు. ఈ రెండింటి కంటే చేపలు మరింత హెల్దీ. కానీ, ఏ రకం మాంసం అయినా కొలెస్ట్రాల్ ముప్పు మాత్రం ఉంటుందంటున్నారు సైంటిస్టులు. కేవలం మాంసం మాత్రమే కాకుండా.. జంతువుల నుంచి వచ్చే.. వెన్న, జంతువుల కొవ్వు, పౌల్ట్రీ స్కిన్, ఇవి కూడా ‘లో డెన్సిటీ లైపో ప్రొటీన్స్ (ఎల్‌డీఎల్)’ని ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్తంలో కలిసి చెడు కొలెస్ట్రాల్‌గా మారే అవకాశం ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీయొచ్చు.
