Spread the love

ట్రంప్ పెల్చినా బాంబు… ఎన్నారై లు భరత్ వస్తే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు బాంబు పేల్చారు. దీంతో హెచ్1బీ వీసాదారులతో పాటు ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇది భారత్‌కు ఒక చక్కటి అవకాశంగా నిపుణులు చెబుతున్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన ప్రతిభావంతులను ప్రోత్సహించి.. దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా మలచుకంటే.. ఆర్థికంగా, సాంకేతికంగా భారత్ పురోగమిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నారైలంతా భారత్‌కు తిరిగొస్తే ఏమవుతుంది? అమెరికాకు వాటిల్లే నష్టమేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్‌పై పగబట్టినట్లు వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఒకదాని తర్వాత ఒక బాంబు పేలుస్తున్నారు. ఇటీవల 50 శాతం సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్, తాజాగా హెచ్‌1బీ వీసా బాంబు పేల్చారు. ఇక నుంచి ఏదైనా అమెరికన్ కంపెనీ విదేశీయుడికి ఉద్యోగం ఇవ్వాలంటే.. హెచ్1బీ వీసా కోసం ప్రభుత్వానికి లక్ష డాలర్ల ఫీజు కట్టాలి. ఇప్పటికే హెచ్‌1బీ లబ్ధిదారుల్లో భారతీయులే 71 శాతం ఉన్నారు. ఇప్పుడు వారితో పాటు హెచ్‌1బీ ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. అయితే హెచ్‍1బీ వీసా ఫీజు పెంపు ఒకరకంగా భారత్‌కు మంచి అవకాశంగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్థిక, సాంకేతిక వృద్ధికి దోహదపడిన భారతీయ టాలెంట్ స్వదేశానికి వచ్చి.. దేశ అభివృద్ధిలో కీలకంగా నిలుస్తారని చెబుతున్నారు.

దశాబ్దాలుగా భారత్‌లోని ప్రతిభావంతులు అవకాశాల కోసం విదేశాల బాట పడుతున్నారు. ముఖ్యంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాల్లో.. నాణ్యమైన విద్య, ప్రపంచ స్థాయి అవకాశాలు, సిలికాన్ వ్యాలీ లాంటి ఇన్నోవేషన్ డ్రివెన్ వ్యవస్థలో పని చేయాలని చాలా మంది అమెరికా బాట పట్టారు. ఇలాంటి వారికి హె1బీ వీసా సువర్ణావకాశంగా మారింది. కొందరు ఉద్యోగాల్లో చేరగా.. మరికొందరు ముందుడుగేసి స్టార్టప్‌లు పెట్టి వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. అయితే ట్రంప్ తీసుకున్న హెచ్1బీ ఫీజు నిర్ణయం వల్ల.. ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ నిర్ణయం ద్వారా అమెరికాకు ఐటీ సేవలు ఎక్కువగా అందిస్తోన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ మొత్తంగా చూస్తే ఈ పరిణామం భారత్‌కు మంచి అవకాశం అవుతుందని నిపుణులు అంటున్నారు.