లాభలే కాదు..నష్టాలు కూడా ఉన్నాయి… ఎవరికీ ప్రమాదమో తెలుసా…
చాలా మంది ఆరోగ్యానికి మంచిదని గుడ్డు తింటుంటారు. అయితే, గుడ్డు రోజూ తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. అంతేకాకుండా కొందరు గుడ్డును తినకూడదు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యం ఉండటం ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఇక, ఆరోగ్యం కోసం చాలా మంది ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. వాటిలో గుడ్డు ఒకటి. గుడ్డు ప్రోటీన్ మంచి వనరు. అంతేకాకుండా గుడ్డులో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు లభిస్తాయి. గుడ్లు తినడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. చాలా మంది గుడ్డును బ్రేక్ ఫాస్ట్‌లో తింటారు. ఇక, జిమ్‌కు వెళ్లేవాళ్లు ఎక్కువగా గుడ్డు తింటుంటారు. చాలా మంది గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మాత్రమే విని ఉంటారు. అయితే, గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. అంతేకాకుండా కొందరు గుడ్డును తినకూడదు. గుడ్డు ఎవరు, ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం

గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు గుడ్లు తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీళ్లు గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెకి ప్రమాదం పెరుగుతుంది

గుడ్డులోని తెల్లసొనలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది బి విటమిన్ బయోటిన్‌తో కలిసి దాని శోషణను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన వండటం వల్ల అవిడిన్ డీనేచర్ అవుతుంది. బయోటిన్ శోషణను అడ్డుకునే దాని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. జుట్టు, చర్మ సంరక్షణకు బయోటిన్ అవసరం. అందుకే గుడ్డును ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు.

మాయో క్లినిక్ రిపోర్ట్ ప్రకారం.. గుడ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జీర్ణ సమస్యలతో బాధపడేవారు గుడ్లు తినడం హానికరం. గుడ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఇది జీర్ణ సమస్యను పెంచుతుంది. ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడేవారు గుడ్లు తినడం వల్ల కొన్నిసార్లు అజీర్ణం, వాంతులు, వికారం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే జీర్ణసమస్యలతో బాధపడేవారు గుడ్లకు దూరంగా ఉండాలి.
