21న జరిగే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే!

ఇదే రోజు భాద్రపద మాసం అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు. ఈ మహాలయ అమావాస్యకు హిందు సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ నుంచి పితృ పక్షం ప్రారంభమైంది. ఈ పితృ పక్షానికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సుమారు 15 రోజుల పాటు ఈ పితృ పక్షాలు ఉంటాయి. భాద్రపద మాసం అమావాస్య రోజు అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఈ పితృ పక్షాలు ముగుస్తాయి. ఈ 15 రోజుల కాలం పూర్వీకులను స్మరించుకుంటూ.. వారికి పితృకార్యాలు చేసేదిగా పండితులు చెబుతారు.

ఈ పితృ పక్షం సమయంలో పూర్వీకులు 15 రోజులు భూమి మీదకి వచ్చి తమ వారసులను ఆశీర్వదిస్తారని ప్రగాఢ విశ్వాసం. మహాభారతంలో కూడా ఈ మహాలయ అమావాస్య ప్రస్తావన ఉందంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మహాలయ అమావాస్య విశిష్టత ఏమిటంటే.. ఎవరైనా ఒక వ్యక్తి ఏరోజు, ఏ తిథిలో చనిపోయారో తెలియక వారి చనిపోయిన ఏడాదిలో, తిథిలో శ్రాద్ధ కర్మలు నిర్వహించలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఎంతో పుణ్యమని అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరించిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలుగుతాయని ఈ ఏడాది మొత్తం దాని ఫలితం ఉంటుందని కూడా చెబుతారు.
