కొండెక్కిన కొబ్బరి నూనె ధర కారణం… |

గత కొన్ని నెలలుగా ఇతర నూనెల ధరలతో పోలిస్తే కొబ్బరి నూనె ధర విపరీతంగా పెరుగుతోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
జూన్‌లో ఇండియాలో యాన్యువల్ రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 1.06 శాతానికి తగ్గింది. 2019 జనవరి తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ కొన్ని వస్తువుల ధరలు మాత్రం ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా వంట నూనెల విషయంలో ఏడాది క్రితంతో పోలిస్తే జూన్‌లో ధరల పెరుగుదల 17.75 శాతానికి చేరింది. ప్రస్తుతం పామాయిల్ రిటైల్ ధర కిలోకు రూ.132. ఏడాది క్రితం రూ.95గా ఉండేది. సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆవ నూనె ధరలు వరుసగా రూ.120 నుంచి రూ.154, రూ.115 నుంచి రూ.159, రూ.150 నుంచి రూ.176కి పెరిగాయి. అయితే, ఈ నూనెల ధరల పెరుగుదల కొబ్బరి నూనెతో పోలిస్తే చాలా తక్కువ.

ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కేరళలోని కొచ్చి మార్కెట్‌లో కొబ్బరి నూనె హోల్‌సేల్ ధర (Coconut Oil price) క్వింటాలుకు రూ.22,500 నుంచి రూ.39,000కి పెరిగింది. రిటైల్ స్థాయిలో కిలోకు దాదాపు రూ.460కి అమ్ముడవుతోంది. ఇది జనవరి ప్రారంభంలో ఉన్న రూ.240-250 ధర కంటే దాదాపు రెట్టింపు. దీంతో కొబ్బరి నూనె ఇప్పుడు నువ్వుల నూనె కంటే ఖరీదైనదిగా మారింది.

ఇండోనేషియా ప్రభుత్వం ముడి కొబ్బరి ఎగుమతులపై ఆంక్షలు విధించాలని ఆలోచిస్తోందనే వార్తలు ధరల సెంటిమెంట్‌ను మరింత పెంచాయి. స్థానిక ప్రాసెసర్లకు కొరత ఏర్పడుతుందనే ఆందోళనల మధ్య ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంతలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అక్టోబర్ 2024 నుంచి దేశంలో విక్రయించే డీజిల్‌లో కొబ్బరి నూనె ఆధారిత CME (కోకో-మిథైల్ ఈస్టర్)ని 3% తప్పనిసరిగా కలపాలని ఆదేశించింది. ఈ మిశ్రమం అక్టోబర్ 2025 నుంచి 4%, అక్టోబర్ 2026 నుంచి 5%కి పెరిగే అవకాశం ఉంది. దీంతో నూనె ఎగుమతులు మరింత తగ్గే అవకాశం ఉంది.
ఇండియాలో ఉత్పత్తి అయ్యే 5.7 లక్షల టన్నుల కొబ్బరి నూనెలో.. కేవలం 3.9 లక్షల టన్నులు మాత్రమే వంట కోసం ఉపయోగిస్తారు. మిగిలినది హెయిర్ ఆయిల్, కాస్మెటిక్స్, సబ్బులు, ఇతర పారిశ్రామిక అవసరాలకు వెళ్తుంది. మరోవైపు కొబ్బరి నూనెల స్థానాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామ్ ఆయిల్ ఆక్రమించేస్తున్నాయి. ఆవాలు, నువ్వులు, వేరుశనగ, పత్తిగింజల ద్వారా నూనెలది కూడా అదే పరిస్థితి. దీంతో దేశీయంగా ఉత్పత్తి తగ్గి కొబ్బరి నూనెల ధరలు (Coconut Oil price) మరింత పెరిగే ప్రమాదం ఉంది.
