షాక్ ఇచ్చిన మెంత తుఫాను…|
అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. మొంథా తుపాను.. మొత్తం 3సార్లు దిశ మార్చుకుంది. రాత్రి 10 గంటల సమయంలో మూడోసారి దిశ మార్చుకొని.. ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అప్పటివరకూ ఉన్న అంచనాలు కూడా తప్పేలా చేసింది. చివరకు అది అంతర్వేది కింద నుంచి.. రాత్రి 11.30కి తీరం దాటింది. అది నరసాపురం దగ్గర తీరం దాటింది అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఐతే.. శాటిలైట్ లైవ్ మ్యాపింగ్ ప్రకారం.. తుపాను.. ఎగ్జాక్ట్‌గా అంతర్వేదికి దక్షిణంగా కాళీపట్నం దగ్గర తీరం దాటింది. ఆ తర్వాత భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాకలంక, ఏలూరు, బాపులపాడువైపు వెళ్లింది.

ఈ తుపాను దిశ మార్చుకోవడానికి ప్రధాన కారణం.. ఏపీ భౌగోళిక విధానమే అనుకోవచ్చు. భూమికి దగ్గరయ్యే సమయంలో.. సముద్ర లోతు తగ్గుతుంది. దాంతో.. సుడి తిరిగే విధానంలో మార్పులొస్తాయి. రాత్రి 10 గంటల సమయంలో అదే జరిగింది. అప్పటివరకూ గుండ్రంగా ఉన్న సుడి.. ఒక్కసారిగా దీర్ఘ చతురస్రాకారంలోకి మారింది. దాంతో దాని దిశ మారిపోయింది. ఆ తర్వాత మళ్లీ సుడి గుండ్రంగా ఏర్పడి.. చివరకు అంతర్వేదికి దక్షిణంగా తీరం దాటినట్లైంది. ఆ సమయంలో దాని వేగం గంటకు 75 కిలోమీటర్లుగా ఉంది.

ఈ రోజు తుపాను దిశ ఎలా ఉంటుంది అనేది గమనిస్తే.. అది.. విజయవాడ నుంచి.. వాయవ్యంగా కదులుతూ.. ఉదయం 11 తర్వాత ఖమ్మం నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అప్పటికి దాని సుడి వేగం గంటకు 75 కిలోమీటర్లుగానే ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత వాయుగుండంగా మారుతుంది. అప్పుడు దాని సుడి వేగం గంటకు 55 కిలోమీటర్లుగా ఉంటుంది. మధ్యాహ్నం 12 తర్వాత అది వరంగల్, రామగుండం, ఆదిలాబాద్ వైపుగా వెళ్తూ.. రాత్రి 10 తర్వాత మహారాష్ట్ర లేదా ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లేలా ఉంది.

భారత వాతావరణ శాఖ ప్రకారం.. అక్టోబర్ 30న తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే అక్టోబర్ 29న ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. 3 రోజులపాటూ.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. అందువల్ల ఇవాళ రెండు రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలి.
