Spread the love

ఎన్నాళ్లకు…మల్లి.. చూస్తున్నాం

పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన బాలకృష్ణ, విజయశాంతి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బాలకృష్ణ ‘అఖండ-2’ చిత్రంలో విజయశాంతికి కీలక పాత్ర పోషించబోతున్నారట!

నటసింహ నందమూరి బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జోడీ అప్పట్లో విశేషాదరణ చూరగొంది. వారిద్దరూ నటించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అలాంటి జోడీ మళ్ళీ ఇన్నాళ్ళకు కలసి నటించబోతున్నారన్న వార్త విశేషంగా వినిపిస్తోంది. దాంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఎందుకంటే బాలయ్య, విజయశాంతి దాదాపు 32 ఏళ్ళ క్రితం ‘నిప్పురవ్వ’లో చివరిసారిగా కలసి కనిపించారు.

వారిద్దరి తొలి చిత్రం ‘కథానాయకుడు’ సిల్వర్ జూబ్లీ చూసింది. ఇక వారిద్దరి జోడీతో రూపొందిన ‘ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య’ సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నాయి. బాలయ్య తొలిసారి డ్యుయల్ రోల్ లో కనిపించిన ‘అపూర్వ సహోదరులు’లోనూ విజయశాంతి ఓ నాయిక.

అలాంటి జోడీ మళ్ళీ కలసి ఓ సినిమాలో కనిపించనుందంటే ఫ్యాన్స్ కు పండగే!

ఇంతకూ బాలకృష్ణతో విజయశాంతి మరోమారు నటించబోయే సినిమా ఏదంటే ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘అఖండ-2’. అసలే బాలకృష్ణకు అచ్చివచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే బాలయ్యతో వరుస హిట్స్ తో హ్యాట్రిక్ చూశాడు బోయపాటి. సూపర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్ గా రూపొందుతోన్న ‘అఖండ-2’లో ఓ కీలక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారని విశేషంగా వినిపిస్తోంది. అదే నిజమైతే ఫ్యాన్స్ కు లభించే కిక్కే వేరని చెప్పక తప్పదు.