Spread the love

నేడు ఈ జిల్లాలకు భారీ వర్షాలు…

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం దిశ మార్చుకుంది. చెన్నైకి అతి సమీపంలో ఉన్న వాయుగుండం మంగళవారం ఉదయం ఉత్తరంగా పయనించేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో మధ్యాహ్నం దక్షిణ నైరుతి వైపు దిశ మార్చుకుని ఉత్తర తమిళనాడు వైపు వెళుతోంది.

బుధవారం ఉదయంలోగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడు, కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వైపు వెళ్లనుంది. పడమర వైపు నుంచి బలమైన గాలులు వీయడంతో నెమ్మదిగా పయనిస్తూ దిశ మార్చుకుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో మంగళవారం రాయలసీమ, కోస్తాల్లో ఎక్కువచోట్ల వర్షాలు, కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా మల్లాంలో 9.65, చిట్టుమూరులో 9.575, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 9.2, తిరుపతి జిల్లా అల్లంపాడులో 7.2, తడలో 5.9, పూలతోటలో 5.8, ఏలూరు జిల్లా కాకర్లమూడిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది