Spread the love

అందరికి కానీ… అంత వరకు మాత్రమే…

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మహిళామణులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే మరో అప్ డేట్ ఇచ్చారు.

ఆడవాళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు ముహుర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే.తాజాగా దానిపై మరో స్పష్టత ఇచ్చారు సీఎం చంద్రబాబునాయుడు. శ్రీశైలం జిల్లా పర్యటనలో ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

అయితే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ముఖ్యమంత్రి చిన్న పేచి పెట్టారు. మహిళలకు ఫ్రీ టికెట్ జర్నీ కేవలం జిల్లా పరిధికి మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లాలో మాత్రమే ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు.

శ్రీశైలం పర్యటనలో భాగంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కచ్చితంగా అమలు చేస్తామని మరోసారి ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు.

అయితే ఇప్పటి వరకు ఏపీలోని మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం మొత్తం ఉచితంగా తిరగవచ్చని భావించారు. తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి ఫథకం తరహాలోనే ఏపీలో కూడా అమలు చేస్తారని భావించారు. కాని చంద్రబాబు కేవలం ఏ జిల్లాలో ఉన్న వాళ్లకు ఆ జిల్లాకే పరిమితం అని చెప్పడంపై ఒకింత నైరాశ్యానికి గురవుతున్నారు.

ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో చాలా పథకాల్లో కోత పెడుతున్నారని వాపోతున్నారు ఏపీ ప్రజలు. వైసీపీ ఇచ్చిన అమ్మఒడి డబ్బులు ఏఢాది ఆలస్యంగా తల్లికి వందనం పేరుతో ఇచ్చారని పెదవి విరుస్తున్నారు. అదే విధంగా ఫించన్ విషయంలో కూడా కొందరి పేర్లు తొలగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన చేసినందుకు సంతోషించాలో ..కేవలం ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లాలో మాత్రమే తిరగాలనే కండీషన్ పెట్టినందుకు చింతించాలో అర్దం కావడం లేదని కొందరు మహిళలు వాపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా అమలవుతుందనుకున్న ఈ పథకం తెలంగాణలో పూర్తిగా ..ఆంధ్రాలో అసంపూర్తిగా అమలవుతుందనే విమర్శలు వస్తున్నాయి.