Spread the love

ఏపీ మహిళలకు అదిరిపోయే న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అదిరిపోయే గుడ్ న్యూస్… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో హామీలను ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో మహిళలకు ఉచి బస్సు ప్రయాణం కూడా ఉంది. ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ నేతృ‌త్వంలోని కూటమి ప్రభుత్వం… ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి కూడా ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ పథకాన్ని జిల్లా పరిధిలకే పరిమితం చేయనున్నట్టుగా కూడా చెప్పారు. అంటే మహిళలు వారు ఉంటున్న జిల్లాల్లో మాత్రమే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావించింది.

అయితే ఇందుకు సంబంధించి కొంతమేర విమర్శలు కూడా వినిపించాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ఇతర రాష్ట్రాల మాదిరిగా… ఏపీలో కూడా పథకాన్ని అమలు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం వైపు నుంచి మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక జిల్లాకు పరిమితం కాదని ప్రకటించారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నామని… మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్లొచ్చని తెలిపారు.

ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఉచితంగా ప్రయాణించేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా చెప్పారు.
ఇదిలాఉంటే, సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేరో టికెట్’ ఇవ్వాలని ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు… ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి… 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ… వంటి వివరాలు ఆ టిక్కెట్‌లో పొందుపరచాలని చెప్పారు. తద్వారా జీరో ఫేర్ టిక్కెట్‌ ఇవ్వడం ద్వారా ఎంత లబ్దిపొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందని, ఇందుకు సంబంధించి సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని సీఎం చద్రబాబు ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్ధికంగా ఎంత భారం పడింది… మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని ఆగస్ట్ 15 నుంచి సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.