Spread the love

తిరుమల కొండకు కూడా… |

ఏపీలో మహిళల ఉచిత బస్సు పథకానికి మంచి స్పందన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో మహిళా ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా, అయిదు కేటగిరీల బస్సు ల్లోనే ఈ పథకం అమలు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఘాట్ రోడ్లలో ఈ పథకం అమలు పైన తొలుత ఆమోదం లభించంలేదు. అయితే, తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ తిరుమల కొండకూ ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది . ఇదే సమయంలో ఈ పథకం వినియోగం కోసం మహిళలకు ప్రత్యేకంగా కార్డులు ఇవ్వనుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఈ పథకం అమలు పైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాట్ రోడ్లలోనూ అమలు దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో, తిరుమల కొండపైకి వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఘాట్‌రోడ్డు అయినందున ఆ బస్సుల్లో సీటింగ్‌ వరకే అనుమతి ఉంటుందని చెప్పారు. అయితే ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదని కొనకళ్ల స్పష్టం చేసారు. అదే విధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు స్మార్ట్‌ కార్డులను అందజేస్తామని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

ఉచిత ప్రయాణం వినియోగించుకునే మహిళలు గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. కాగా, ప్రయాణానికి ఆధార్‌ జిరాక్స్‌ కాపీలను కూడా అనుమతించాలని ఆదేశించామని ఎండీ వెల్లడించారు. ఈ పథకం ద్వారా రోజుకు 25నుంచి 26లక్షల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేశామని, అయితే, పథకం ప్రారంభమయ్యాక తొలి ఐదు రోజుల్లో రోజుకు సగటున 18 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు. విద్యార్థుల బస్సుల్లో స్త్రీ శక్తి వర్తించదన్నారు.