టీ నీ మరిగించి,మరిగించి తాగుతున్నారా
మనం టీని మళ్లీ వేడి చేసి తాగొచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇది మనందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ప్రశ్న. చాలామంది టీని వేడిగా తయారు చేసుకున్న తర్వాత, దాన్ని ఎక్కువసేపు అలాగే వదిలేయడం, కొన్నిసార్లు పూర్తిగా మర్చిపోవడం వంటివి చేస్తుంటారు. టీని మళ్లీ వేడి చేస్తే ఏం జరుగుతుంది, ఎందుకు మనం దాన్ని మానుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

టీని పదే పదే వేడి చేయడం వల్ల దాని రుచి, పోషక విలువలు, సువాసన తగ్గిపోతాయి. టీని నాలుగు గంటలకు పైగా అలాగే వదిలేసినట్లయితే.. దాన్ని మళ్లీ వేడి చేయకపోవడమే మంచిది. ఎందుకంటే- అందులో ఫంగస్, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. పాలు, హెర్బల్, ఫ్రూటీతో తయారు చేసిన టీని మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని అనేక ప్రయోజనకరమైన గుణాలు నశించిపోతాయి. టీలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ వంటివి అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు ఆవిరైపోతాయి.

టీని ఎప్పుడూ మరిగించకూడదు.. ముఖ్యంగా పాలు, చక్కెర కలిపి ఉన్నప్పుడు. టీ తయారుచేయడానికి ముందుగా నీటిని మరిగించి పొయ్యి మీద నుండి తీసేయాలి. ఆ తర్వాత టీ ఆకులను అందులో 3-4 నిమిషాలు నానబెట్టాలి. ఈ ప్రక్రియనే ‘బ్రూయింగ్’ అంటారు. ఒకవేళ మీరు టీ ఆకులను నేరుగా నీటిలో మరిగించినట్లయితే- అందులోని పోషకాలు, రుచి, సువాసన చాలావరకు తగ్గిపోతాయి. అదే టీని మళ్లీ మరిగిస్తే ఏం జరుగుతుందో ఊహించుకోండి! టీలో ఫుడ్ పాయిజనింగ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. పాలు కలిపిన టీ విషయంలో ఇది మరింత అధికం. పాలు ఉండటం వల్ల బ్యాక్టీరియా వేగంగా పేరుకుపోతుంది. టీని మళ్లీ వేడి చేసినప్పటికీ అవి చనిపోవు. టీలో ఫంగస్ వృద్ధి చెందితే సమస్యలు తీవ్రమవుతాయి. అలాంటి టీని మళ్లీ వేడి చేసి తాగినప్పుడు అవి కడుపు నొప్పి, అతిసారం, తిమ్మిర్లు, వికారం, వాపు, ఇంకా అనేక జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.

మళ్లీ వేడి చేయడం వల్ల టీ రుచిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. టీ రంగు, రుచికి టానిన్లు కారణం. టీని ఎక్కువసేపు అలాగే ఉంచినప్పుడు లేదా తర్వాత మళ్లీ వేడి చేసినప్పుడు అది ఆకుల నుండి అదనపు టానిన్లను విడుదల చేయడానికి కారణమవుతుంది. తద్వారా టీ చేదుగా మారుతుంది. స్ట్రాంగ్ టీని తాగడానికి ఇష్టపడని వారికి ఇది రుచించకపోవచ్చు.
చల్లారిన టీని మళ్లీ వేడి చేయడం మంచిది కానప్పటికీ- తప్పనిసరి అయినప్పుడు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదట- చల్లారిన టీని శుభ్రమైన కప్పులో ఉంచాలి. మరొక పాత్రలో నీటిని మరిగించి, ఆ కప్పును మరిగే నీటిలో 3-4 నిమిషాలు ఉంచాలి. దీన్ని ‘డబుల్ బాయిలర్’ పద్ధతి అంటారు. అలా చేసినప్పుడు కూడా టీ మునుపటి లాగా మళ్లీ తాజాగా ఉంటుందని ఆశించవద్దు
