చిరంజీవి నాకు

శోభన్ బాబు ఓ కార్యక్రమంలో చిరంజీవి తన బిడ్డతో సమానం అని అన్నారు. అలా ఎందుకన్నారో
చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. కానీ ఆ పోటీని ఆరోగ్యకరంగా ఉంచడమే కీలకం. ప్రస్తుతం స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు అభిమానుల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుతుంటాయి. తమకు ఇష్టం లేని హీరోల వ్యక్తిగత విషయాలపై కొందరు అసభ్యకరమైన పోస్టులు, ట్రోల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా అభిమానుల మధ్య గొడవలు జరిగేవి.

అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు.. కృష్ణ, శోభన్ బాబు అభిమానులు.. ఎన్టీఆర్ ఏఎన్నార్ అభిమానులు గొడవ పడేవారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి లెజెండ్రీ హీరోల కెరీర్ చివరి దశకు చేరుకున్నప్పుడు చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు స్టార్లుగా ఎదిగారు. ఆ టైంలో శోభన్ బాబు అభిమానులు.. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల అభిమానులతో కూడా వివాదానికి దిగేవారట.

అభిమానుల మధ్య గొడవలు గురించి శోభన్ బాబు స్వయంగా ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇతర హీరోల అభిమానులతో గొడవలు వద్దని శోభన్ బాబు తన ఫ్యాన్స్ కి చెబుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. శోభన్ బాబు మాట్లాడుతూ.. నా అభిమానులు నాకు సొంత కుటుంబంతో సమానం. ఇప్పుడు కొత్త తరం హీరోలు ఎదుగుతున్నారు. వారిని మీరు ఏ విధంగానూ కించపరచవద్దు. ఎందుకంటే ఏ హీరోతో కూడా నాకు పోటీ లేదు.

చిరంజీవి, బాలకృష్ణ నాకు బిడ్డలతో సమానం. వాళ్లకి దాదాపుగా నా పిల్లల ఏజ్ ఉంటుంది. కాబట్టి వాళ్లని నా సొంత బిడ్డల్లాగానే భావిస్తాను. ప్రపంచంలో ఏ తండ్రి కూడా తన బిడ్డలతో పోటీ పడాలని అనుకోడు. కాబట్టి నన్ను ఎవరితోనూ పోల్చకండి. నా బిడ్డ లాంటి వారితో నాకు పోటీ ఏంటి అని శోభన్ బాబు తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ లతో నాకు పోటీ పెట్టకండి. కుదిరితే వాళ్లని ప్రోత్సాహించండి. అంతగా మీకు నచ్చకపోతే సైలెంట్ గా ఉండండి అని శోభన్ బాబు తన అభిమానులకు హితబోధ చేశారు.
