ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్..

దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాలపై తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చిన అధికారులు.. ఎల్లో అలెర్ట్ జారీ చేశారు

ఒడిశా గోపాల్‌పూర్ సమీపంలో తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీన పడుతున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం కోస్తా జిల్లాలపై భారీగా ఉంటుందని తెలిపింది. అటు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఇవాళ(శుక్రవారం) మూడు జిల్లాలకు రెడ్డ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముంది. అటు విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరులో జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే తీరప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు రెండ్రోజులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. విశాఖపట్నం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మరోవైపు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన అలెర్ట్ ఇచ్చిన నేపధ్యంలో పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. శ్రీకాకుళం జిల్లాలోని 10 మండలాల పాఠశాలలకు జిల్లా డీఈఓ రవికుమార్ సెలవులు ప్రకటించారు. నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, శ్రీకాకుళం, హిరమండలం, గార, సరుబుజ్జిలి, ఎల్ఎన్ పేట మండలాల్లోని స్కూళ్లకు ఈ సెలవులు వర్తించనున్నాయని చెప్పారు. ఇక ఇప్పటికే మన్యం జిల్లాలోని స్కూల్స్‌కు డీఈఓ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
