Spread the love

బీసీసీఐ కొత్త నిబంధన…

క్రికెట్‌లో ఏజ్ ఇష్యూ అనేది ఎప్పుడూ ఉండేదే. ఇంత వయసు వారే ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఆడాలనే నిబంధనేం లేదు. కానీ ఎక్కువగా 17 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆటగాళ్లే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తుంటారు. సచిన్ టెండూల్కర్, పార్థీవ్ పటేల్ లాంటి కొందరు ప్లేయర్లు 16 ఏళ్ల వయసులోనే దేశవాళీలతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ దుమ్మురేపడం తెలిసిందే. ఇటీవల వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ డెబ్యూ ఇచ్చి 35 బంతుల్లో సెంచరీతో చరిత్ర సృష్టించాడు. అయితే అతడి వయసుపై ఎక్కువగా విమర్శలు వ్యక్తమయ్యాయి. వైభవ్ వయసు దాస్తున్నాడని.. అతడికి 16 ఏళ్లు ఉంటాయని, కానీ 14 అంటున్నాడనే కామెంట్స్ వినిపించాయి. ఇలా ప్లేయర్ల వయసుపై వచ్చే విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

వైభవ్ సూర్యవంశీ మోసం చేశాడని.. అతడు వయసును దాచేశాడంటూ ఐపీఎల్ సమయంలో విమర్శలు వచ్చాయి. అతడితో పాటు మరికొందరు క్రికెటర్ల డెబ్యూ సమయంలోనూ ఇలాంటి కామెంట్సే వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల వయసును నిర్ధారిచేందుకు జూనియర్ లెవల్‌ క్రికెట్‌లో కొత్త నిబంధన తీసుకొచ్చింది బీసీసీఐ. అదే బోన్ టెస్ట్. ప్రస్తుతం కూడా దాదాపుగా ఇలాంటి పద్ధతినే బోర్డు అనుసరిస్తోంది. టీడబ్ల్యూ3 అనే పద్ధతిలో ఆటగాళ్లకు బోన్ టెస్ట్ నిర్వహిస్తోంది.

ఇప్పటికే ఉన్న టీడబ్ల్యూ3 టెస్ట్‌లో గనుక ఆటగాళ్లు విఫలమైతే అప్పుడు కొత్త రూల్ ప్రకారం మరోమారు బోన్ టెస్ట్ పెడతారట. సాంకేతిక కారణాల వల్ల ఏ ఆటగాడు కూడా ఆటను మిస్ అవ్వొద్దనే కారణంతో మరోమారు బోన్ టెస్ట్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అండర్-16 ఆడే ఆటగాళ్లకు బోన్ టెస్ట్ క్వాలిఫికేషన్‌‌ పాయింట్స్‌ను 16.4గా నిర్ధారించారని సమాచారం. ఇప్పటికే ఇందులో పాస్ అయిన వారికి బోన్ టెస్ట్ నిర్వహించరు. అదే క్వాలిఫై అవ్వని వారికి తిరిగి పరీక్ష పెడతారు. అందులోనూ ఫెయిలైతే ఇక వాళ్లు ఇంటికే అని విశ్లేషకులు చెబుతున్నారు.