Spread the love

A.P.మహిళలకు సర్కార్ మరో శుభవార్త… |

ఏపీలో సంక్షేమ పథకాలు లేవని బాధపడుతున్న లబ్దిదారులకు కూటమి సర్కార్ వరుసగా శుభవార్తలు చెబుతోంది. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి సర్కార్..త్వరలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు 20 వేలు ఇచ్చే పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదే క్రమంలో త్వరలో మరో సూపర్ సిక్స్ పథకం అమలుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలో గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడ బిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 వంతున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అంతకు ముందే ఆడ బిడ్డ నిధి పథకం అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది

నెలకు రూ.1500 చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తులు ఆన్ లైన్ లో తీసుకునేందుకు వీలుగా వెబ్ సైట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు కోసం రూ.3 వేల కోట్లకు పైగా నిధులు కూడా సమీకరిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం రూ.3,300 కోట్ల నిధులను కూడా కేటాయించింది.

ఆ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు సుమారు 1000 కోట్ల రూపాయలు అందించనున్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు మరో రూ.630 కోట్లు, మైనార్టీ మహిళలకోసం రూ.84 కోట్లు, ఎస్సీ,ఎస్టీ వర్గాల ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులను వెచ్చించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ కీలక పథకం అమలు కోసం మహిళలు కూడా ఎదురుచూస్తున్నారు.