Spread the love

మొఖంపై నల్లమచ్చలకు కారణం…|

మొటిమలను నొక్కడం వల్ల నల్ల మచ్చలు ఏర్పడి, ముఖ సౌందర్యం దెబ్బతింటుందని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. పసుపు, పెరుగు, తేనె, కలబంద ఫేస్ ప్యాక్‌లు సహాయపడతాయి

ముఖంపై ఒక్క మొటిమ కనిపిస్తే చాలు.. అద్దం ముందు నిలబడి దాన్ని పగలగొట్టాలనే ఆలోచన చాలా మందికి వస్తుంది. కానీ అదే ఆవేశం తర్వాత రోజుల తరబడి మిగిలే నల్ల మచ్చలకు కారణమవుతుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొటిమలు చాలా సాధారణమైన చర్మ సమస్య అయినప్పటికీ, వాటిని సరైన విధంగా చూసుకోకపోతే ముఖ సౌందర్యాన్ని దీర్ఘకాలం దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పులు, నూనె పదార్థాలు, మసాలా ఆహారం వల్ల మొటిమల సమస్య ఎక్కువగా కనిపిస్తాయి.

చాలా మంది ముఖంపై వచ్చిన మొటిమలనునొక్కడం లేదా పగలగొట్టడం వల్ల సమస్య తీరుతుందని భావిస్తారు. కానీ అదే సమయంలో చర్మం లోపల తీవ్రమైన వాపు ఏర్పడి, మొటిమ ఎండిపోయిన తర్వాత కూడా నల్లటి మచ్చలుగా మారుతుంది. అందుకే మొటిమను ఎప్పుడూ విచ్ఛిన్నం చేయొద్దని డెర్మటాలజిస్టులు కఠినంగా సూచిస్తున్నారు. ఒక క్షణం తీరిన సంతృప్తి.. నెలల తరబడి మిగిలే మచ్చలకు దారి తీస్తుందని చెబుతున్నారు.

నిపుణుల వివరాల ప్రకారం, మొటిమల కారణంగా చర్మంలో వాపు ఏర్పడినప్పుడు మెలనిన్ అనే వర్ణద్రవ్యం అసమానంగా వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రక్రియ వల్లే నల్లటి మచ్చలు లేదా డార్క్ స్పాట్స్ ఏర్పడతాయి. వాపు సమయంలో విడుదలయ్యే కొన్ని రసాయన పదార్థాలు చర్మ రంగును మరింత ముదురు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనినే పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్‌గా పిలుస్తారు.

ఈ నల్ల మచ్చలను తగ్గించడానికి ఖరీదైన ట్రీట్‌మెంట్లకు వెళ్లకముందు ఇంటి చిట్కాలు ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పసుపు మరియు పెరుగు కలయికతో చేసే ఫేస్ ప్యాక్ మొటిమలు, మచ్చలపై మంచి ప్రభావం చూపిస్తుంది. పసుపు మంటను తగ్గిస్తే, పెరుగు చర్మాన్ని మృదువుగా శుభ్రపరుస్తుంది. వారానికి రెండుసార్లు వాడితే చర్మంలో సహజ మెరుపు కనిపిస్తుంది.

అలాగే తేనె, కలబంద మిశ్రమం కూడా మొటిమల నివారణకు బాగా పనిచేస్తుంది. ఈ రెండు పదార్థాలు సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటంతో కొత్త మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. క్రమం తప్పకుండా వాడితే చర్మం ప్రశాంతంగా మారి, మచ్చలు క్రమంగా తగ్గుతాయి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు వాడవచ్చు.

డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నవారు నిమ్మరసం, తేనెతో ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. అయితే ఇది చర్మాన్ని సూర్యకాంతికి సున్నితంగా మారుస్తుంది కాబట్టి సాయంత్రం మాత్రమే వాడాలి. మరుసటి రోజు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ముఖ్యంగా ఓర్పు చాలా ముఖ్యం. మొటిమలను నొక్కకుండా, సరైన సంరక్షణ పాటిస్తే ముఖం మళ్లీ సహజంగా మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.