యుద్ధం కారణంగా నూనె ధరల్లో భారీ మార్పులు…|
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గత 5 రోజులుగా ప్రపంచ మార్కెట్లు షేక్ అవుతున్నాయి. దీని ప్రభావం ఇండియాపైన కూడా పడింది. దీంతో సామాన్యులు ఊహించని విధంగా వంటనూనె ధరలు భారీగా పెరిగాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఊహించని ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచంలో కీలక ఆర్థిక వ్యవస్థలైన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అనేక దేశాలపై పరోక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీని ఫలితంగా రోజువారీ జీవితంలో ఉపయోగించే వంట నూనె ధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్కసారిగా వంట నూనె ధరలు పెరగడంతో గృహిణులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వంట నూనె ధరలు లీటరుపై ఎంత పెరిగాయంటే?ఇటీవల వంట నూనె ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం వరకు స్థిరంగా ఉన్న ధరలు ఈ వారం లీటర్‌కు సుమారు 4 నుండి 5 రూపాయల వరకు పెరిగాయి. మార్కెట్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే వారాల్లో మరింత పెరుగుదల కనిపించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. న్యూస్18 కన్నడ వెల్లడించిన కథనం ప్రకారం.. లీటర్‌కు మరో 10 నుండి 15 రూపాయల వరకు పెరిగే అవకాశమూ ఉందని అంచనా. ఈ పెరుగుదల కేవలం స్థానిక మార్కెట్ కారణంగా మాత్రమే కాదు. అంతర్జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

వంట నూనె ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగానే వీటి ధరలు పెరుగున్నాయి. ఈ యుద్ధం ముఖ్యంగా సముద్ర మార్గాలపై ప్రభావం చూపుతోంది. భారత్‌కు అవసరమైన వంట నూనెలలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ముఖ్యంగా సన్‌ప్లవర్ నూనె, పామ్ ఆయిల్ వంటి నూనెలను ఉక్రెయిన్, రష్యా, ఇండోనేషియా, మలేషియా, మధ్యప్రాచ్య ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
యుద్ధ పరిస్థితుల కారణంగా ఆయా దేశాల నుంచి వచ్చే నౌకాశ్రయ రవాణా పూర్తిగా స్తంభించింది. ప్రత్యేకంగా హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే నౌకల రాకపోకలు ప్రభావితమయ్యాయి. ఈ మార్గం ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైనది. అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో నౌకలు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని నౌకలను ఇరాన్ ప్రాంతం చుట్టూ నిలిపివేయడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలైన కేప్ ఆఫ్ గుడ్ హోప్ వైపు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గం చాలా పొడవుగా ఉంటుంది. దాంతో ప్రయాణ సమయం పెరుగుతుంది. ఇంధన ఖర్చులు, రవాణా వ్యయాలు కూడా అధికమవుతున్నాయి. ఈ అదనపు ఖర్చులు చివరకు దిగుమతి ధరలను పెంచుతున్నాయి.

కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం..భారత్‌లో వంట నూనె వినియోగం ప్రతి కుటుంబానికి రోజువారీ అవసరం. అలాంటి కీలక వస్తువు ధర పెరగడం మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది. ఇంటి ఖర్చులను సమతుల్యం చేసుకోవడం ఇప్పటికే కష్టంగా మారిన పరిస్థితుల్లో ఈ పెరుగుదల మరింత ఒత్తిడిని తీసుకొస్తోందని న్యూస్18 కన్నడ తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ వ్యాపారాలు కూడా ఈ పెరుగుదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వంట నూనె ఖర్చు పెరగడంతో ఆహార పదార్థాల తయారీ వ్యయం పెరుగుతోంది. దీని ప్రభావం భవిష్యత్తులో ఆహార పదార్థాల ధరలపై కూడా కనిపించే అవకాశం ఉంది.
భవిష్యత్తులో మరింత పెరుగుదల?మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువ రోజులు కొనసాగితే ప్రపంచ మార్కెట్లపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా జరుగుతుంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ వాణిజ్యం మొత్తం ప్రభావితమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. వంట నూనె ధరలు మాత్రమే కాదు. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత కుటుంబాల వంటగదులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ రాజకీయ పరిణామాలు సాధారణ ప్రజల రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ పరిణామం స్పష్టంగా చూపిస్తోంది.
