Spread the love

భగ్గుమంటున్న భానుడు… ఎండలతో ప్రజల ఇబ్బందులు…|

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భానుడి భగభగలతో (Heat Wave) ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఏలూరు నగరంలో 39 డిగ్రీల సెంటీగ్రేడ్‌ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్చి ఆరంభంలోనే ఉషోగ్రతల తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడి ప్రభావం విపరీతంగా ఉంది. గతంలో ఏప్రిల్‌లో ఈ ఎండల తీవ్రత కనిపించేది. కాని పిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత 37 డిగ్రీలకు చేరింది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఏలూరుతోపాటు భీమడోలు, నూజివీడు, జంగారెడ్గిగూడెం, ద్వారకాతిరుమల, కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, టి.నరసాపురం, కామవరపుకోట, చింతలపూడి, దెందులూరు, పెదవేగి, పెదపాడు, లింగపాలెం మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, భీమవరం, తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలుతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. మధ్యాహ్నం సమయంలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు. ఏలూరు నగరంలోని ప్రధాన రహదారులపై మధ్యాహ్నం సమయంలో జనసంచారం అంతంత మాత్రంగానే కనిపించింది. జూట్‌మిల్‌ సెంటర్‌, కర్రవంతెన సెంటర్‌లో రహదారులు నిర్మాణుష్యంగా కనిపించాయి. ఎండల తీవ్రత తట్టుకోలేక ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఈమేరకు పండ్ల రసాలు, బటర్‌మిల్క్స్‌, లస్సీ, కొబ్బరి బొండాలు, చెరకురసం దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా కనబడుతోంది.

పెరిగిన ఏసీ, కూలర్ల వినియోగం..

ఏసీలు, ఎయిర్‌ కూలర్ల వినియోగం పెరిగింది. గృహాల్లో రోజువారీ విద్యుత్‌ వాడకం పెరిగింది. ఎండల ప్రభావంతో జ్వరబాధితులు పెరుగుతున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ప్రతి చోటా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఏదిఏమైనా మార్చిలోనే ఎండల తీవ్రత ఈవిధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.