Spread the love

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు భారీ వర్షసూచన జారీ చేసింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. అటు మూడ్రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని స్పష్టం చేసింది. 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరోసారి వర్షసూచన జారీ చేసింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడనున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని ప్రజలను హెచ్చరించింది. బాపట్ల, తిరుపతి, చిత్తూరు, మార్కాపురం, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.